గత నెల రోజులుగా కర్ణాటకలో రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తోన్న మాజీ మంత్రి రాసలీలల సీడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. చివరకు ఇది కాంగ్రెస్ నేత మెడకు చుట్టుకునేలా ఉంది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన డీకే శివకుమార్‌పై సీడీలోని యువతి కుటుంబం సంచలన ఆరోపణలు చేసింది. సీడీ తయారీ, తమ కుమార్తె అజ్ఞాతం వెనుక శివకుమార్ హస్తం ఉందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. మా కుమార్తెతో ఆయనే ఇదంతా చేయిస్తారని, రాజకీయాలకు ఆమె బలైపోతుందని వాపోయారు. ‘మా సోదరిని శివకుమార్ తీసుకెళ్లి, అన్నీ చేయిస్తున్నారు. రాజకీయాలకు ఆమె బలైపోతోంది. ఆమెను గుప్పెట్లో పెట్టుకున్న నాయకులు తక్షణమే సురక్షితంగా విడిచి పెట్టాల’ని ఆ యువతి సోదరుడు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ ఆరోపణలను డీకే శివకుమార్ ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీపీ అధ్యక్షుడ్ని కావడంతో తనను కలవడానికి నిత్యం వందలాది మంది వస్తుంటారని, వారందరితో తనకు వ్యక్తిగత పరిచయం ఉండదని వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రమేశ్ జార్ఖిహొళి ప్రయత్నిస్తున్నారని తెలిసిన వెంటనే, ఆయనపై పార్టీ తరపున నిఘా పెట్టించినట్టు అంగీకరించారు. అంతేగానీ, ఆయన వ్యక్తిగత విషయాలపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని డీకే స్పష్టం చేశారు. అలాగే, ఓ మీడియా సంస్థకు చెందిన నరేశ్ అనే వ్యక్తితో తనకు మొదటి నుంచీ పరిచయం ఉందన్నారు. ఆయన నివాసానికి నేను చాలాసార్లు వెళ్లానని డీకే తెలిపారు. రమేశ్ జార్ఖిహొళి తనను నిత్యం స్మరించుకుంటున్నా, ఆయన్ను అడ్డుకోబోనని అన్నారు. సీడీలోని యువతి తల్లిదండ్రుల ఆరోపణలు నేపథ్యంలో సదాశివనగరలోని శివకుమార్ నివాసం వద్ద భద్రతను పెంచారు. సదాశివనగర పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అటు యువతి తరఫున పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌కు ఫిర్యాదు చేసిన లాయర్ జగదీశ్.. కబ్బన్‌పార్కు పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేశారు. ‘వీడియోలో ఉన్నది నేను కాదు. గ్రాఫిక్స్‌తో దాన్ని తయారు చేశారని’ రాసలీలల వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న యువతి తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో మాట్లాడిన యాసకు, ఆడియోలో ఉన్న యాసకు పొంతన లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3w3mV1z
No comments:
Post a Comment