Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 25 August 2021

కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత.. మదర్ థెరిసా

ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి అమ్మగా మారింది. భారతీయులతో ‘అమ్మ’అని పిలిపించుకున్న అంతటి మహొన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ. మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతోంది. తండ్రి సేవాతత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ థెరిసా... అనారోగ్యంతో ఆయన 1919లో కన్నుమూయగా, మరణానికి ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది. 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమైన మదర్.. తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరింది. ఆ సంస్థకు చెందిన కోల్‌కతాలోని స్కూల్‌కు 1937, మే 4న టీచర్‌గా వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామ చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు. అనాథల కోసం మొతిజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేసి, వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్‌కతా వీధుల్లో జోలెపట్టి కడుపు నింపారు. ఆమె సేవానిరతిని గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయంగా నిలిచారు. ఆర్థికంగా ఆ స్కూలుకు సాయం లభించడంతో 1950లో వాటికన్ అనుమతితో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా దాదాపు 45 ఏళ్లు ఎందరో అభాగ్యులు, పేదలు, రోగులకు సేవలందించారు. అనేక అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవీ, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి స్వాంతన చేకూర్చారు. మదర్ థెరిసాకు 1951లో భారత పౌరసత్వం లభించింది. 1979లో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక, భారత అత్యున్నత పౌర పురస్కారం 1980లో భారతరత్న ఆమెను వరించింది. థెరీసా సేవలు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలకు సైతం తన సేవలను విస్తరించారు. జాయన్ గ్రాఫ్ క్లూకాస్ రాసిన జీవితచరిత్ర ప్రకారం12 ఏళ్ల తర్వాత ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటురోగాలు సోకినవారికి, బాధితులు, శరణార్థులు, అంధులు, దివ్యాంగులు, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు. 1982లో ఇజ్రాయిల్ - పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుక్కున్న 37 మంది పిల్లలను థెరీసా కాపాడారు. రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు. 1997న మార్చి 13న మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 5న మరణించారు. అయితే, ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటిచెబుతున్నారు. ‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న’అన్న నినాదం తోనే విశ్వమాతగా పేరు గాంచిన మదర్ థెరీసాకు సెయింట్‌హుడ్ హోదా కూడా దక్కింది. తమ మరణం తర్వాత కూడా కొన్ని అద్బుతాలను చేసేవారికి వాటికన్ సిటీ ‘సెయింట్’ఘా ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించాలంటే కనీసం రెండు అద్బుతాలు జరగాలి అప్పుడే వారు దేవత స్థానాన్ని పొందుతారు. ఇదే తరహాలో కడుపులో కణితితో బాధపడుతున్న ఓ బెంగాలీ గిరిజన మహిళను థెరిసా స్వస్థపరచడాన్ని ఆమె చేసిన మొదటి అద్భుతంగా 1998లో గుర్తించారు. థెరీసాకు చేసిన ప్రార్థనల వల్లే తనకు కణితి పూర్తిగా నయమైపోయిందని ఆమె చెప్పినప్పుడు రెండో అద్బుతం కోసం చూసింది. ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తిని మదర్‌థెరిసా తన దివ్యశక్తితో నయం చేయడాన్ని ఆమె చేసిన రెండో అద్భుతంగా గుర్తించి మదర్ థెరీసాను సెయింట్‌గా గుర్తిస్తూ వాటికన్ సిటీ ప్రకటించింది. ఎక్కడో విదేశాల్లో పుట్టి, సేవా మార్గంలో పయనించి, భారతదేశంలోని కోల్‌కతాలో స్థిరపడి, అనారోగ్యంతో బాధపడ్తున్నవారిని చేరదీసి, సేవలు చేసిన ‘తల్లి’ థెరీసా రాయడానికి వీల్లేనంత దయనీయ స్థితిలో రోగంతో బాధపడ్తున్నవారిని అక్కునచేర్చుకున్న ‘దేవత’. పట్టుకుంటే ఆ రోగం తమకెక్కడ అంటుకుంటుందోనని కుటుంబ సభ్యులు రోడ్డున పడేసిన అభాగ్యులు, మదర్‌ థెరీసా పుణ్యమా అని కోలుకున్నారు. ఇక బతికే అవకాశం లేదని తెలిసీ, చివరి రోజుల్లో మథర్ థెరీసా సపర్యలతో బాధల్ని మర్చిపోయారు కొందరు అభాగ్యులు. అయితే, లక్షలాది మంది ప్రజలు,ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలు ఆమెను కీర్తించినప్పటికీ విమర్శలను కూడా ఎదుర్కొని.. వాటికి తన సేవతో సమాధానం చెప్పారు. క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వక్తలు, విశ్వ హిందూ పరిషత్ వంటివి మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం చేస్తున్నారని ఆరోపించాయి. 1952లో కోల్‌కతాలో ‘హోమ్ ఫర్ ది డయింగ్ ను ప్రారంభించారు. భారత అధికారుల సహాయ సహకారాలతో పాడుబడిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చివేశారు. ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం ‘నిర్మల్ హృదయ్’గా పేరు పెట్టారు. ఈ నిలయానికి వచ్చేవారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మలను అనుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు. ముస్లింలు ఖురాన్ చదివేవారు, హిందువులకు గంగా జలం అందించేవారు, కాథలిక్స్‌కు వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించేవారు. ఆమె మాటలలో అది ‘ఒక అందమైన చావు’, జంతువులలా బ్రతికిన మనుషులకు ప్రేమతో దేవతల వంటి చావును కల్పించడం.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3DhHQ4E

No comments:

Post a Comment