రెచ్చిపోయిన మావోలు: రోడ్డు నిర్మాణ కూలీలను చితకబాది, 12 వాహనాలకు నిప్పు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రహదారి నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కూలీలు, సిబ్బందిని చితకబాది, వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటన బీజాపూర్‌, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో చోటుచేసుకుంది. బాంబ్రాగఢ్‌ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద దోదరాజ్‌ నుంచి కవండే వరకు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయుధాలతో ఆ ప్రదేశానికి వచ్చిన మావోయిస్టులు రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాదారు. అనంతరం 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ ఉనికికి ప్రమాదమని భావించి మావోయిస్టులు వాహనాలను తగులబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, మావోయిస్ట్‌లు ఇలా రహదారి నిర్మాణ పనులను అడ్డుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుసార్లు వాహనాలకు నిప్పంటించి, కూలీలను చితికబాదారు. అంతేకాదు, రహదారి నిర్మాణ పనులకు రక్షణ కల్పిస్తున్న భద్రతా బలగాలపై మెరుపుదాడికి పాల్పడ్డారు. మార్చి 11, 2017లో సుక్మా జిల్లాలోని చిటగుఫాను కలుపుతూ చేపట్టిన 5.5 కిలోమీటర్ల రహదారి పనుల రక్షణ కోసం 36 మంది జవాన్లు క్యాంప్ నుంచి రాగా.. వారి కదలికలను గుర్తించిన మావోయిస్టుల బృందం అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడి తూటాల వర్షం కురిపించింది. జవాన్లు భోజనాలు చేస్తున్న సమయంలో నక్సలైట్లు గ్రనేడ్లతో దాడిచేసి బుల్లెట్ల వర్షం కురిపించడంతో 25 మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు. దాడి తర్వాత భారీ సంఖ్యలో ఆయుధాలను కూడా దోచుకుపోయారు. వీటిలో 13 ఏకే సిరీస్ రైఫిల్స్, 5 ఇన్సాస్ రైఫిల్స్, వివిధ రైఫిల్స్‌కు చెందిన 3,420 తూటాలు, 75 మాగిజైన్ ఏకే రైఫిల్స్, 31 ఐఎన్ఎస్ఏఎస్, 67 యూజీబీఎల్ రైఫిల్స్, 22 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, రెండు బైనాక్యులర్లు, 5 వైర్‌లెస్ సెట్లతోపాటు మెటల్ డిటెక్టర్లను కూడా ఎత్తుకుపోయారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3fOWmGs

Post a Comment

0 Comments