కోవిడ్ ఆంక్షల ఉల్లంఘన… 4 ఏళ్లకుపైగా జైలు శిక్ష

కోవిడ్ వైరస్ కట్టడి కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో ఒక్క కేసు ఉండకూడదనే లక్ష్యంతో జియాంగ్‌, యోంగ్జూ న‌గ‌రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నట్టు అక్కడ జనం ఆరోపణలు చేస్తున్నారు. అయినా వాటిని పట్టించుకోకుండా చైనా కఠినమైన లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది. జీరో వైరస్ కంట్రీ‌గా మార్చేందుకు ఆంక్షలను అమలు చేస్తోంది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోతే శిక్షిస్తోంది. కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు చైనా ప్రభుత్వం ముగ్గురు వ్యక్తులకు నాలుగేళ్లకుపైగా జైలు శిక్ష వేసింది. బీజింగ్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న డాలియన్‌ ఓడరేవుకు చెందిన ఒక కార్గో సంస్థలో పనిచేసే సిబ్బంది మాస్క్‌లు ధరించలేదు. మాస్క్‌లు వేసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగారు. దాంతో 83 మందికి వైరస్ సోకింది. ఇది 2020లో నవంబర్‌లో జరిగింది. ఆ టైంలో డాలియన్, బీజింగ్‌, లియానింగ్‌లో పెద్ద ఎత్తున వైరస్ కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారించిన అధికారులు సిబ్బంది మాస్క్‌లు ధరించకపోవడాన్ని సంస్థ పట్టించుకోలేదని పేర్కొని ఆ సంస్థపై భారీ జరిమానా విధించారు. అంతేకాదు సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిధులకు 39 నుంచి 57 నెలల వరకు జైలు శిక్ష వేశారు. కాగా చైనాలో మరో నగరంలోనూ వైరస్ కేసులు వెలుగు చూడడంతో స్థానిక ప్రభుత్వం అక్కడ కూడా లాక్‌డౌన్ విధించింది. అన్యాంగ్ నగరంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి దీంతో ఆ న‌గ‌రంలో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు అధికారులు వెల్లడించారు. 55 లక్షల జ‌నాభా ఉన్న ఆ న‌గ‌రంలో ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అక్కడి ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణయంతో చైనాలో రెండు కోట్ల మంది ఇళ్లకు పరిమితం అయ్యారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3zP0Oyh

Post a Comment

0 Comments