ఉత్తర్ ప్రదేశ్ కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా... మౌర్య రాజీనామా బీజేపీకి ఓ రకంగా ఇబ్బందికరమే. కాగా, తాను మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ఇంకా బీజేపీలోనే కొనసాగుతున్నానని స్వామి ప్రసాద్ మౌర్య బుధవారం వెల్లడించారు. ఇంకా బీజేపీనీ వీడలేదని, సమాజ్‌వాదీ పార్టీలోనూ చేరలేదని ఆయన పేర్కొన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణను జనవరి 14న ప్రకటిస్తానని ఆయన తెలియజేశారు. తాను ఎస్పీలో చేరానంటూ చేస్తున్న ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. తాను పార్టీని వీడటంతో బీజేపీలో భూకంపం వచ్చిందని వ్యాఖ్యానించారు. మౌర్య ప్రసాద్‌తో పాటు బీజేపీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ శాక్యలు ఆ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో తాను మంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని స్వామి ప్రసాద్ సమర్ధించుకున్నారు. ‘‘నేను కేవలం మంత్రి పదవికే రాజీనామా చేశాను.. త్వరలోనే బీజేపీకి రాజీనామా చేస్తాను.. ప్రస్తుతం నేను సమాజ్‌వాదీ పార్టీలో చేరలేదు.. బీజేపీని నేను తిరస్కరించాను.. తిరిగి ఆ పార్టీలోకి వెళ్లే ప్రశ్నే లేదు’’ అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జనవరి 14న ఎస్పీలో చేరుతున్నట్టు చెప్పారు. తనకు ఏ రాజకీయ నేత నుంచి కూడా పిలుపు రాలేదని తెలిపారు. మౌర్య తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. మౌర్య ఫోటోను షేర్ చేస్తూ ఆయన మద్దతుదారులతో సహా ఎస్పీలోకి ఆహ్వానించారు. అఖిలేశ్ యాదవ్ తనకు శుభాకాంక్షలు చెప్పిన విషయాన్ని స్వామి ప్రసాద్ అంగీకరించారు. ‘‘నేను నా సన్నిహితులు, మద్దతుదారులతో గురువారం సమావేశమవుతాను.. జనవరి 14న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను.. నా వెంట వచ్చేవారికి నా నిర్ణయాన్ని తెలియజేస్తాను’’ అని చెప్పారు. ముఖ్యమైన ఓబీసీ నాయకుల వలసలతో ఖంగుతిన్న బీజేపీ నాయకత్వం.. తిరుగుబాటుదారులను బుజ్జగించే బాధ్యతను డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు అప్పగించింది. బీజేపీకి చెందిన ముఖ్యమైన ఓబీసీ నాయకుల్లో కేశవ్ ప్రసాద్ మౌర్య ఒకరు. అఖిలేష్ యాదవ్‌కు కౌంటర్‌గా యూపీ ఎన్నికలలో యాదవేతర ఓబీసీ ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3re3jGq
0 Comments