రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు.. సైనిక సామర్ధ్యాన్ని చాటిచెప్పేలా పరేడ్

దేశ రాజధాని ఢిల్లీలో 73 వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ప్రధాని వెంట రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా త్రివిధ దళాధిపతులు ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ పరిమితి సంఖ్యలోనే రాజ్‌పథ్ వద్ద వేడుకలకు సందర్శకులను అనుమతించారు. ఈ ఏడాది కూడా విదేశీ అతిథి లేకుండానే వేడుకలు జరుగుతున్నాయి. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. జాతీయ గీతం ఆలపిస్తుండగా.. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 21 గన్స్‌తో రాష్ట్రపతికి సెల్యూట్ చేశారు. గణతంత్ర పరేడ్‌లో ఆకాశ్ క్షిపణులు, రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం దేశానికి విశిష్ట సేవలందించిన పలువురికి సేవా మెడల్స్ అందజేశారు. ఉగ్రవాదుల దాడిలో అమరుడైన జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఏఎస్ఐ బాబూ రామ్‌ సతీమణి బీనా రాణి కోవింద్ చేతుల మీదుగా మరణానంతరం అశోక్ చక్ర అవార్డును అందుకున్నారు. 2020 ఆగస్టులో బాబూరామ్ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి వీరోచిత పోరాటంలో అమరుడయ్యారు. త్రివిధ దళాలు దేశ సైనిక సామర్ధ్యాన్ని చాటిచెప్పేలా పరేడ్ నిర్వహిస్తున్నాయి. రఫేల్, సుఖోయ్, అపాచీ యుద్ధ విమానాల విన్యాసాలు కొనసాగుతున్నాయి. తొలుత అశ్విక దళంతో పరేడ్ మొదలయ్యింది. ప్రపంచంలోనే మనుగడలో ఉన్న ఏకైక అశ్వికదళం.. భారత సైన్యానికి చెందిన 61 కావల్రీ రెజిమెంట్. రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ రెజిమెంట్‌కు చెందిన అశ్విక దళం మంచి గుర్తింపు పొందింది. పరేడ్‌లో అవకాశం దక్కించుకున్న 12 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలు.. తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, విభాగాల పనితీరును చాటిచెప్పాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన జానపద, సాహిత్యాలను ప్రతిబింబించాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3IEC1jO

Post a Comment

0 Comments