Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 18 February 2022

అహ్మదాబాద్ పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్ష.. 11 మందికి జీవితఖైదు

2008 ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు శుక్రవారం శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసులో మొత్తం 49ని దోషులుగా నిర్ధారించిన కోర్టు.. 38 మందికి మరణ శిక్ష, మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. పేలుళ్ల కేసుకు సంబంధించి మొత్తం 77 మంది నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల కేసులో దోషులకు శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు కొనసాగాయి. మంగళవారం వాదనలు ముగియడంతో చివరకు నేడు దోషులకు శిక్షలను ఖరారు చేసింది. అహ్మదాబాద్‌లో 2008 జులై 26న 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మంది గాయపడ్డారు. వరుస పేలుళ్ల ఘటనపై దర్యాప్తు జరిపిన గుజరాత్‌ పోలీసులు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశారు. వీరిలో చాలా మందికి ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం), హర్ఖత్ ఉల్ జిహాదీ ఆల్ ఇస్లామీ తీవ్రవాద సంస్థలే ఈ పేలుళ్లకు కారణమని తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలులో ఉంచారు. అయితే కొంతమంది నిందితులు జైలులో సొరంగం తవ్వి పారిపోవడానికి విఫలయత్నం చేశారు. మొత్తం 13 ఏళ్ల పాటు జరిగిన ఈ విచారణలో 1,100 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు 49 మందిని దోషులుగా తేల్చింది. సెక్షన్ 302, 307, దేశద్రోహం, దేశానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రోత్సహించడం వంటి కేసుల కింద నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అహ్మదాబాద్‌లోని మణినగర్, హఠ్‌కేశ్వర్ సర్కిల్, ఎల్జీ ఆసుపత్రి, సివిల్ ఆసుపత్రి ట్రామా సెంటర్ ఏరియాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. మణినగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల్లోనే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ మణినగర్ అసెంబ్లీ స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పుడు గుజరాత్‌కు హోంమంత్రిగా ఉన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాంబులు అమర్చిన కుట్రదారులు... క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే సమయంలో ఆసుపత్రుల సమీపంలో అమర్చిన బాంబులు విస్పోటనం చెందేలా టైమింగ్‌ను సెట్ చేశారు. దీంతో ఎక్కువ ప్రాణ, ఆస్తినష్టం జరిగేలా చూడటమే వారి లక్ష్యం.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/CKiOWrt

No comments:

Post a Comment