Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 20 February 2022

అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం.. పర భాషలు నేర్చుకోడానికి అమ్మ భాషే మార్గం

సాహిత్య వారసత్వ సంపదకు జాతి మనుగడకు మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది. అటువంటి మాతృభాషను అపురూపంగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సామాన్యులు కూడా మాతృభాషలోనే భావవ్యక్తీకరణ ద్వారా ఒకరికొకరు దగ్గరవుతారనేది సత్యం. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. అమ్మ ఒడే బిడ్డకు తొలి పాఠశాల. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. భాషతోనే ప్రజలకు గుర్తింపు, కమ్యూనికేషన్, సామాజిక సమైక్యత, విద్య, అభివృద్ధి.. ఇది మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రపంచీకరణ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించినా, మాతృభాషలకు మాత్రం ముప్పుగా పరిణమించింది. భాషలు నిర్వీర్యమైతే సాంస్కృతిక వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. అంతేకాదు, అవకాశాలు, సంప్రదాయాలు, జ్ఞాపకశక్తి, ప్రత్యేకమైన ఆలోచనా విధానం, వ్యక్తీకరణ, భవిష్యత్తును నిర్ధారించడానికి విలువైన వనరులు కూడా నశించిపోతాయి. ప్రపంచంలోని మొత్తం 6 వేల భాషల్లో 43 శాతం ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. కేవలం కొన్ని భాషలకు మాత్రమే విద్య వ్యవస్థలో చోటుదక్కితే, అతి కొద్ది వాటిని మాత్రమే డిజిటల్ ప్రపంచంలో వినియోగిస్తున్నారు. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21నే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని 30వ సాధారణ మహాసభ 1999 నవంబరు 17న ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తోంది. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే పర భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో నొక్కి వక్కానించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్‌ను యునెస్కో ప్రకటిస్తోంది. ‘‘‘బహుభాషల అభ్యాసం కోసం సాంకేతికతను ఉపయోగించడం.. సవాళ్లు, అవకాశాలు’’ అనేది ఈ ఏడాది థీమ్. యునెస్కో కేంద్ర కార్యాలయంతోపాటు, ఐరాస సాధారణ అసెంబ్లీలోనూ ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ‘‘భాషా వైవిధ్యాన్ని రక్షించడానికి సాంకేతికత కొత్త సాధనాలను అందించగలదు.. ఉదాహరణకు ఇటువంటి సాధనాలు వ్యాప్తి, విశ్లేషణను సులభతరం చేయడం, కొన్నిసార్లు మౌఖిక రూపంలో మాత్రమే ఉన్న భాషలను రికార్డ్ చేయడానికి, సంరక్షించడానికి సహకరిస్తాయి.. సరళంగా చెప్పాలంటే ఈ సాధనాలు స్థానిక మాండలికాలను భాగస్వామ్య వారసత్వంగా మారుస్తాయి. అయినప్పటికీ, భాష ఏకీకరణ ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి సాంకేతిక పురోగతి బహుభాషావాదానికి ఉపయోగపడుతుందని మేము ఖచ్చితంగా తెలుసుకోవాలి.’’ యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే అన్నారు. యూఎన్ చాంబర్ మ్యూజిక్ సొసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉన్నతాధికారుల ప్రసంగాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా బహుభాషలు, భాషా నైపుణ్యాల గురించి చేపట్టిన సర్వే వివరాలను వెల్లడించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం మరే భాషలోనూ లేవనేది చాలా మంది కవుల అభిప్రాయం. ప్రపంచీకరణతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. వివిధ దేశాల మధ్య సంబంధాలు ఎంతగానో బలపడ్డాయి. వ్యాపార, వాణిజ్య, ఉపాధి, ఉద్యోగ, విద్యావకాశాల కోసం విదేశాలకు వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. అందు వల్ల ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. అందుకే ఇంగ్లిష్ భాష నేర్చుకోవడం అవశరమూ, విజ్ఞాన సముపార్జన ధ్యేయం కావాలే కానీ మోజు కాకూడదు. దీని మోజులో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందించడం ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం అందరి కర్తవ్యం.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/UXZInsj

No comments:

Post a Comment