
పెద్దల అవినీతి బాగోతాన్ని అంతర్జాతీయ మీడియా బట్టబయలు చేసింది. పెద్దలుగా చెలామణి అవుతున్న పాక్ నేతలు స్విస్ బ్యాంకుల్లో వేల కోట్లు దాచిపెట్టినట్టు గుట్టురట్టయ్యింది. మొత్తం 1,400 మందికి సంబంధించిన 600 బ్యాంకు ఖాతాల వివరాలు బహిర్గతమయ్యాయి. వీరిలో ఐఎస్‌ఐ మాజీ చీఫ్ జనరల్ అక్తర్ అబ్దుర్ రహమాన్ ఖాన్ సహా ఇతర జనరల్స్, కీలక నేతల పేర్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లో రిజిస్టర్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ నుంచి ఈ వివరాలు బయటకు పొక్కాయి. దానికి సంబంధించి వెలువడిన నివేదికపై పలు మీడియా సంస్థలు కథనాలు రాశాయి. రష్యాకు వ్యతిరేకంగా అఫ్గనిస్థాన్‌లోని ముజాహిదీన్‌లు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చిన నిధులు, తదితరాలను అందించడంలో ఐఎస్ఐ మాజీ చీఫ్ రహమాన్ ఖాన్ సహకరించినట్టు ఆ నివేదికను ఉటంకిస్తూ న్యూయార్క్ కథనం పేర్కొంది. ముజాహిదీన్‌ల కోసం కోసం సౌదీ అరేబియా, యుఎస్ నుంచి వచ్చిన నిధులు అమెరికన్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) స్విస్ బ్యాంక్ ఖాతాకు వెళ్లాయని డాన్ వార్తాపత్రిక తెలిపింది. ఈ ప్రక్రియలో చివరి గ్రహీత పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఎస్‌ఐ). ఆ సమయంలో ఐఎస్‌ఐకు రహమాన్ ఖాన్ నేతృత్వం వహిస్తున్నారని నివేదికను ఉటంకిస్తూ పేర్కొంది. మరోవైపు, స్విట్జర్లాండ్‌లో పాకిస్థానీల సగటు గరిష్ఠ నిల్వ 4.42 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లని న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక కథనం వెల్లడించింది. రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న వారిలో కొందరు ప్రభుత్వ పదవుల్లో ఉన్పప్పటికీ.. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ వివరాలను తెలియజేయలేదు. 2016లో పనామా, 2017లో ప్యారడైజ్, 2021లో పండోర పేపర్ల తర్వాత తాజా లీకుల వ్యవహారం బయటకు వచ్చింది. ఈ సారి 18,000 కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాల డేటా లీక్ అయినట్లు సమాచారం. వాటి విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉందని సమాచారం. మరిన్ని ఖాతాలు ఉండటంతో మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఈ ఏడాది జనవరిలో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకటించిన అవినీతి సూచి 2021లో పాక్ 140 స్థానంలో ఉంది. మొత్తం 180 దేశాల జాబితాలో అంతకు ముందు ఏడాదితో పోల్చితే దాయాది స్థానం 16 స్థానాలు దిగజారింది. 2021 సీపీఐ (కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్) జాబితాలో 180 దేశాలకు 0– 100 (అత్యధిక అవినీతి– అవినీతి రహితం)రేంజ్‌లో మార్కులు ఇచ్చారు. ఈ జాబితాలో 28 సీపీఐతో పాక్ 140వ స్థానంలో నిలిచింది. పాక్‌లో రూల్ ఆఫ్ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషించింది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/pVlgdLi
No comments:
Post a Comment