Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 21 February 2022

రష్యా దూకుడు.. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్రం ప్రకటించిన పుతిన్

ఉక్రెయిన్‌‌ ఆక్రమణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఓవైపు సైన్యాలను మోహరించి.. వేర్పాటువాదులకు సహకరిస్తోంది. తాజాగా, కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు ఉక్రెయిన్‌లో రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా అధ్యక్షుడు స్వతంత్రం ప్రకటించారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అధికారిక టెలివిజన్‌లో సోమవారం భావోద్వేగ ప్రసంగం చేసిన పుతిన్.. డొనెటస్క్, లుగాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ‘‘చాలా కాలంగా వినిపిస్తున్న డొనెటస్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌ల స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాన్ని తక్షణమే గుర్తించడం కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను’’అని అన్నారు. వేర్పాటువాదులతో పరస్పర సహకారం, స్నేహపూర్వక ఒప్పందాలపై పుతిన్ సంతకం చేసినట్టు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది. తన నిర్ణయానికి పార్లమెంట్ ఎగువ సభ మద్దుతు ఇవ్వాలని తన ప్రసంగం చివరిలో పుతిన్ కోరారు. కాగా, డొనెటస్క్, లుగాన్స్క్‌లను ప్రత్యేక దేశాలుగా గుర్తించే బిల్లుపై ఉభయసభల్లో మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. తూర్పు ప్రాంతంలోని రష్యా మద్దతుదారులపై సైనిక ఆపరేషన్లను నిలిపివేయాలని వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్ చేశారు. ‘తూర్పు ఉక్రెయిన్‌లో మెరుపు దాడులను చేస్తున్న ఉక్రెయిన్ తక్షణమే మిలటరీ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఒకవేళ అలాకాని పక్షంలో రక్తపాతం కొనసాగడానికి ఉక్రెయిన్‌లో అధికారంలో ఉన్న పాలనా యంత్రాంగం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులను గుర్తించవద్దని పశ్చిమ దేశాలు పదేపదే పుతిన్‌ను హెచ్చరించాయి. ఈ చర్య వివాదాన్ని నియంత్రించే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని పేర్కొన్నాయి. కానీ రష్యా అధినేత మాత్రం ఈ విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ఉక్రెయిన్ అంశంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌ల ప్రసంగాలకు కొద్దిసేపటికి ముందు తిరుగుబాటుదారులను గుర్తిస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ పశ్చిమ దేశాలు రష్యాను మోసం చేస్తూ ఏళ్లు గడిపాయని పుతిన్ ఆరోపించారు. ‘‘ఆధునిక ఉక్రెయిన్ పూర్తిగా రష్యా సృష్టించింది’ అని పుతిన్ అన్నారు. ఆ దేశాన్ని ‘‘ఉక్రెయిన్ ఆఫ్ వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్’ అని పిలవాలి. ఇది రష్యన్ విప్లవకారుడికి రుణపడి ఉంది’’ అని చెప్పారు. తూర్పు ఉక్రెయిన్‌లో మారణహోమం చేస్తున్నారని, అణు ఆయుధాగారాన్ని పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ‘‘నాటోను తూర్పు వైపుకు తరలించడం, రష్యా సరిహద్దులకు దగ్గరగా సైనిక మౌలిక సౌకర్యాల కల్పన ద్వారా పశ్చిమ దేశాలు రష్యా భద్రతకు ఆందోళనగా పరిణమించాయి’’ అని ఆయన అన్నారు. అంతేకాదు, ఉక్రెయిన్‌తో సంబంధం లేకుండా పశ్చిమ దేశాలు రష్యాను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ధ్వజమెత్తారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3wryFcn

No comments:

Post a Comment