
జర్మనీ ఛాన్సెలర్‌తో చర్చల అనంతరం ఉక్రెయిన్‌పై తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. సరిహద్దుల్లో సైనిక విన్యాసాల్లో పాల్గొన్న తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ బుధవారం ప్రకటించింది. అయితే, ఈ దళాలు ఎక్కడి నుంచి వెనుతిరుగుతున్నాయి.. ఎంత మంది వెనక్కి వచ్చేస్తున్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. కానీ రష్యాను అమెరికా సహా పశ్చిమ దేశాలు ఏమాత్రం విశ్వసించడం లేదు. ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అంటున్నాయి. ఉక్రెయిన్‌పై పొంచి ఉన్న యుద్ధమేఘాలు పూర్తిగా తొలగి పోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. రష్యా దాడి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ప్రాణనష్టం భారీగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అటువంటి సమయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకొనేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. రష్యా దాదాపు 1.50 లక్షల సైన్యాలను ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిందని, రష్యా చెబుతున్న బలగాల వెనక్కు మళ్లింపు ధ్రువీకరించలేదని ఆయన గుర్తు చేశారు. ‘‘రష్యా బలగాల ఉసంహరణ మంచిదే. కానీ, మేం దానిని పరిశీలించలేదు. రష్యా దళాలు వెనక్కు తిరిగి వెళ్తున్న విషయాన్ని మేము గమనించలేదు. మా విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం ఇప్పటికీ రష్యా దళాలు చాలా వరకూ ప్రమాదకరమైన పొజిషన్లలోనే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అయినా రష్యా కోరినట్లు దౌత్య చర్చలు కొనసాగించేందుకు అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. బైడెన్ యంత్రాంగంలోని ఓ సీనియర్ అధికారి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా తన సైన్యాలను ఉపసంహరిస్తున్నట్టు చేసిన ప్రకటనను నమ్మలేమని అన్నారు. ‘‘నిన్న ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది.. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తి ప్రదర్శించింది.. కానీ అది అబద్ధమని ఇప్పుడు మనకు తెలుసు’’ అని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఆయన అన్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి తక్కువలో తక్కువగా 7,000 బలగాలను మోహరించిందని, వీటిలో చాలా వరకూ బుధవారమే చేరుకున్నాయని చెప్పారు. అటు, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సరిహద్దుల్లోకి కీలకమైన విభాగాలను తరలిస్తున్నారని పేర్కొన్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/NUiam4P
No comments:
Post a Comment