Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 22 February 2022

UP Elections యూపీలో నాలుగో దశ పోలింగ్.. అందరి దృష్టి లఖింపూర్ ఖేర్‌పైనే

ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగో దశ పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. తొమ్మిది జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గాంధీల కుటుంబానికి కంచుకోటగా భావించే రాయ్ బరేలీ, రైతుల హింసాత్మక ఘటనతో వార్తలో నిలిచిన లఖింపూర్ ఖేరి జిల్లాలు ఇందులో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 51 సీట్లను కైవసం చేసుకోగా.. సమాజ్‌వాదీ పార్టీ నాలుగు, కాంగ్రెస్, బీఎస్పీలు చెరో రెండు, అప్నాదళ్ ఒక స్థానం దక్కించుకున్నాయి. ఫిలిబిత్, లఖింపూర్ ఖేరి, సితాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయబరేలీ, బండా, ఫతేపూర్ జిల్లాల్లోని ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అజయ్‌ మిశ్రా, స్మృతీ ఇరానీ, కౌశల్‌ కిషోర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారికి ఇది ఓ రకంగా అగ్ని పరీక్ష. లఖింపూర్ ఖేర్‌లో గతేడాది అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోపోద్రేకులైన అన్నదాతలు మంత్రి అనుచరులపై దాడిచేయడంతో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటనను యావత్ దేశం ముక్త కంఠంతో ఖండించింది. కేంద్ర మంత్రి కుమారుడ్ని అరెస్ట్ చేయగా.. ఇటీవలే అతడికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని తాజాగా, రైతులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గత ఎన్నికల్లో లఖింపూర్ ఖేర్‌లోని మొత్తం 8 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం బీజేపీ నుంచి సిట్టింగ్‌లే బరిలో ఉండగా.. గత ఎన్నికల్లో వీరి చేతిలో ఓడిపోయినవారికే ఎస్పీ టిక్కెట్లు ఇచ్చింది. యూపీ రాజధాని లక్నోలోని 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అందరి దృష్టి సరోజిని నగర్‌పైనే ఉంది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈడీ మాజీ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్, ఎస్పీ అభ్యర్థిగా ఐఐఎం మాజీ ప్రొఫెసర్ అభిషేక్ మిశ్రా బరిలో ఉన్నారు. లక్నో కంటోన్మెంట్‌లో న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ పాఠక్, లక్నో తూర్పు నుంచి మరో మంత్రి అశుతోష్ టాండన్‌లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్‌ కుటుంబ ప్రాబల్యం ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గం ఆ పార్టీ పరువును కాపాడుతుందా? లేదా? అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా పరిణమించింది. యూపీలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. మార్చి 7తో పోలింగ్ ముగియనుండగా.. 10 ఫలితాలను వెల్లడిస్తారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/MSvpQfk

No comments:

Post a Comment