కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ వివాహం సీపీఐ (ఎం) యువజన విభాగం ప్రెసిడెంట్ పీఏ మొహమూద్ రియాస్‌తో సోమవారం నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహానికి ఓ హత్య కేసులో దోషి హాజరుకావడంతో దుమారం రేగుతోంది. హత్యకేసులో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి వివాహానికి హాజరుకావడం భద్రతా వైఫల్యానికి అద్దంపడుతోందని, దీనిపై ముఖ్యమంత్రి విజయన్ వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. విజయన్ కుమార్తె వివాహానికి ఓ హత్య కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోన్న మొహమూద్ హసీమ్ అనే వ్యక్తి హాజరువడం.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై బీజేపీ కేరళ విభాగం అధికార ప్రతినిధి సందీప్ వారియర్ స్పందిస్తూ ‘ఆర్ఎస్ఎస్ కార్యకర్త సురేంద్రబాబు హత్యకేసులో మొహమూద్ హసీమ్‌కి సుప్రీంకోర్టు 2017లో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది..కోవిడ్-19 కారణంగా అతడు పెరోల్‌పై బయటకు వచ్చాడు.. ఓ దోషి ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వచ్చి, ఆయనతో భుజం భుజం పూసుకుని తిరిగారు.. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమే’ అంటూ మండిపడ్డారు. హత్య కేసులో హసీమ్‌ను కేరళ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించగా.. సుప్రీంకోర్టు మాత్రం 2017లో అతడిని దోషిగా తేల్చి, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, హసీమ్ పెరోల్‌ను రద్దుచేయాలని కోరుతూ న్యాయస్థానానికి వెళ్తామని వారియర్ అన్నారు. అయితే, వరుడు రియాస్ తనకు దగ్గర బంధువని, తాను పెరోల్ నిబంధనలను ఉల్లంఘించలేదని హసీమ్ అన్నాడు. అయితే, అధికార పార్టీ నేతలు సైతం హసీం రాకపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇది పూర్తిగా నిఘా వైఫల్యమని వ్యాఖ్యానిస్తున్నారు. వీణ-రియాస్ వివాహానికి కేవలం 30 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం వివాహానికి 50 మంది వరకు అతిథులు హాజరుకావచ్చు. కానీ, అంతకంటే తక్కువగా ఈ పెళ్లికి హాజరుకావడం విశేషం. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణ వివాహం సీపీఐ (ఎమ్) పార్టీ యూత్ వింగ్ డీవైఎఫ్‌ఐ (డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు పీఏ మహమ్మద్ రియాజ్‌తో సోమవారం జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇది మతాంతర వివాహం కాగా.. సాదాసీదాగా పెళ్లి జరిగింది. అతి కొద్ది మంది అతిథులు, దగ్గరి బంధువుల సమక్షంలో ఇరువురు దండలు మార్చుకుని నిరాడంబరంగా ఒక్కటయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఎలాంటి ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం జరిగింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3e836wJ
0 Comments