దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో పెరిగాయి. గ్యాస్ సిలిండర్ ధర సైతం గత మూడు నెలల్లో భారీగా పెరిగింది. లాక్‌డౌన్ తర్వాత వంట నూనెలతోపాటు నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కిలో ఉల్లిపాయ ధర రూ.50 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఉల్లి ధరలు పెరగడానికి అకాల వర్షాలను కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులు, వంట నూనెల ధరలు భారీగా పెరగ్గా.. త్వరలోనే పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని రట్లాం ప్రాంతంలోని 25 గ్రామాలకు చెందిన పాల ఉత్పత్తిదారులు పాల ధరలను మార్చి 1 నుంచి లీటర్‌కు రూ.55 వరకు పెంచాలని నిర్ణయించారు. పెట్రోలియం ధరలు పెరగడంతో.. రవాణా ఖర్చులు పెరిగాయని.. పశువుల దాణాకయ్యే వ్యయం సైతం పెరిగిందని... అందుకే పాల ధరలను పెంచాల్సి వస్తోందని పాల ఉత్పత్తుదారులు చెబుతున్నారు. పాల ధరను పెంచడానికి అనుమతి ఇవ్వకపోతే.. పాల సరఫరా నిలిపేస్తామని వాళ్లు స్పష్టం చేశారు. కరోనా కారణంగా గతేడాది ధరలు పెంచలేదని... కానీ దాణా ఖర్చు పెరిగిపోవడం.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని రాట్లాం ప్రాంత పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు హీరాలాల్ చౌధురీ తెలిపారు. వీటికి ఒక గేదేను కొనుగోలు చేయడానికి రూ.1 లక్ష నుంచి లక్షన్నర వరకు వెచ్చించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం లీటర్ పాలను రూ.43కు విక్రయిస్తున్నామని.. దాన్ని రూ.55కు పెంచాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాంతంలో పాల ధరలు పెరిగితే అది ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం అవుతుందని భావించలేం. దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. పాల ధరలు పెరుగుతాయన్న ప్రచారం పట్ల రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. దీనికి బాధ్యత ఎవరిది అని ఆయన ప్రశ్నించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dRFI9s
No comments:
Post a Comment