లాక్‌డౌన్ వేళ 1,200 కి.మీ. సైకిల్ తొక్కి సొంతూరుకు చేరిన జ్యోతి తండ్రి మృతి

గతేడాది లాక్‌డౌన్‌ వేళ గాయపడ్డ తండ్రిని వెనుక కూర్చోబెట్టుకుని 1,200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ సొంతూరికి తీసుకెళ్లిన గుర్తుంది కదా. ఈ బిహార్ బాలిక గురించి మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. కాగా ఏడాది తిరగకముందే జ్యోతి తండ్రి మెహన్‌ సోమవారం గుండెపోటుతో మరణించారు. మోహన్‌ మృతి పట్ల దర్భాంగ జిల్లా అధికారులు సానుభూతి ప్రకటించారు. జ్యోతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్‌ పాశ్వాన్‌ కుటుంబ పోషణ కోసం గురుగ్రామ్‌లో ఆటో నడిపేవారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. గతేడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు మోహన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని చూసుకునేందుకు పెద్ద కుమార్తె జ్యోతి కుమారి గురుగ్రామ్‌ వెళ్లింది. ఆ తర్వాత మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ తండ్రీకూతుళ్లు అక్కడే చిక్కుకుపోయారు. మోహన్‌ నడవలేని స్థితిలో ఉండటం.. ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేకపోవడంతో యజమాని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చాడు. పూట గడవడమే కష్టంగా మారింది. అలా దాదాపు నెలన్నర రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక లాభం లేదనుకున్న జ్యోతి ఎలాగైనా తండ్రిని సొంతూరు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ, లాక్‌డౌన్‌తో వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేదు. దీంతో తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఓ పాత సైకిల్‌ కొని దానిపై తండ్రిని ఎక్కించుకుని దాదాపు 1200 కిలోమీటర్లు ప్రయాణం సాగించిందా బాలిక. ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఏడు రోజుల తర్వాత స్వగ్రామానికి చేరింది. జ్యోతి గురించి అప్పట్లో 'సైకిల్‌ గర్ల్‌’ పేరుతో మీడియాలో కథనాలు రావడంతో దేశమంతా ఆమె పేరు మార్మోగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంవ్‌ కుమార్తె ఇవాంకా కూడా బాలికను ప్రశంసించారు. జ్యోతి సాహసాన్ని దేశ ప్రజలతో పాటు భారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ గుర్తించింది. ఆమెకు సైక్లిగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో జ్యోగి ప్రధానమంత్రి బాలల పురస్కారాన్ని సైతం అందుకుంది. అంతేగాక ఆత్మనిర్భర్‌ పేరుతో నిర్మిస్తున్న ఓ సినిమాలో జ్యోతి కథను కూడా తెరకెక్కిస్తుండగా అందులో తన పాత్రను తానే పోషిస్తోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2R9icMb

Post a Comment

0 Comments