నాటో అణు కూటమని మీకు తెలియదా? పుతిన్ బెదిరింపులకు ఫ్రాన్స్ కౌంటర్

ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ను చేపడుతున్నట్టు ప్రకటన చేసిన రష్యా అధ్యక్షుడు .. ఈ చర్యలను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బయటి దేశాలు జోక్యం చేసుకోవాలని చూస్తే.. చరిత్రలో మునుపెన్నడూ ఎదురుకాని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మీరు నా మాట వింటారని ఆశిస్తున్నట్లు ప్రపంచ దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం కాదని.. ఉక్రెయిన్‌ను సైనిక రహితం చేయడం కోసమేనని తెలిపారు. ఉక్రెయిన్‌ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడంతోపాటు ఆ దేశ ప్రభుత్వ అరాచకాలను అంతమొందించడానికి, రష్యా జాతీయులతో పాటు శాంతికాముకులైన ప్రజలపై లెక్కలేనన్ని ఘోర నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికే ‘ప్రత్యేక సైనిక చర్య’ను చేపట్టినట్లు తెలిపారు. రష్యా అధినేత వ్యాఖ్యలకు సభ్య దేశం ఘాటుగా స్పందించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల వినియోగం గురించి బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు, కూడా అణు కూటమి అని అర్థం చేసుకోవాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లె డ్రియన్ గురువారం అన్నారు. ‘మీ చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం.. ఉక్రెయిన్ వివాదంలో అణ్వాయుధాలను ఉపయోగిస్తామని బెదిరించడంతో సమానం కాదా?’ అని అన్న ప్రశ్నకు లె డ్రియన్ సమాధానం ఇస్తూ..‘‘అవును, అట్లాంటిక్ కూటమి అణు కూటమి అని వ్లాదిమిర్ పుతిన్ కూడా అర్థం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. దీని గురించి నేను చెప్పేది ఒక్కటే’’ అని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా.. ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఆ తర్వాత రక్షణ శాఖకు చెందిన కార్యాలయాలను టార్గెట్‌గా చేసుకుంది. ఈ క్రమంలో పలు పౌర భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. రక్షణ కార్యాలయాలతోపాటు.. విద్యుత్తు వ్యవస్థే టార్గెట్‌గా క్షిపణి దాడులు జరిగాయి. ఉక్రెయిన్‌ నౌకాదళ కేంద్రాలను కూడా రష్యా వైమానిక దళం ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదులు స్వేచ్ఛను కోరుకుంటున్నారంటూ రష్యా ముందు నుంచీ వారికి సాయం చేస్తూ వచ్చింది. రెండు రోజుల కిందట రెండు ప్రావిన్సులను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఇది తమ పార్లమెంట్‌లో ఆమోదించిన నిర్ణయమని పేర్కొన్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/RN17soM

Post a Comment

0 Comments