Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 26 November 2019

విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్వీ- సీ47.. నిర్దేశిత కక్ష్యలోకి కార్టోశాట్-3

చంద్రయాన్‌-2తో అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాక వినువీధులో మరోసారి రెపరెలాడింది. తాజాగా సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఇమేజింగ్‌ వ్యవస్థలున్న కార్టోశాట్‌-3ని నవంబరు 27న విజయవంతంగా ప్రయోగించింది. పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌ ద్వారా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ల్యాంచింగ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ప్రయోగానికి ముందు మంగళవారం ఉదయం ప్రారంభమైన 26 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సరిగ్గా బుధవారం ఉదయం గం. 9:28 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ47 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. లాంచింగ్ ప్యాడ్ నుంచి బయలుదేరిన పీఎస్‌ఎల్వీ 166 సెకెన్లలో తొలి దశ, 266 సెకెన్లలో రెండో దశ, ఎనిమిది నిమిషాల్లో మూడో దశను దాటుకుని చివరిదైన నాలుగో దశను విజయవంతంగా పూర్తిచేసింది. నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ చేరిన తర్వాత ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి నిర్దేశిత కక్ష్యలో చేరాయి. తర్వాత లాంచింగ్ కేంద్రం నుంచి బయలుదేరిన 26.51 నిమిషాల్లో కార్టోశాట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతమైన తర్వాత కార్టోశాట్-3 నుంచి అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రానికి సంకేతాలు అందుతాయి. మొత్తం 14 ఉపగ్రహాలను నింగిలోకి పంపగా వీటిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్-3, అమెరికాకు చెందిన 13 వాణిజ్య నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఉపగ్రహాన్ని భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచారు. ఈ ఉపగ్రహ ప్రయోగంతో సరిహద్దుల్లో భద్రత మరింత పటిష్టమవుతుంది. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాని ఉంది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3.. 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు. ఐదేళ్ల కాలపరిమితితో రూపొందించిన కార్టోశాట్ బరువు 1625 కిలోలు. ఈ ఉపగ్రహం తయారీకి మొత్తం రూ.350కోట్లు ఖర్చయింది. దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు, స్థావరాలపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారమందిస్తూ నిఘా నేత్రంలా పనిచేస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీర ప్రాంత వినియోగం గురించి కూడా ఇది సమాచారం అందజేస్తుంది. ఇక, ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి చెంత నమూనాలను ఉంచి పూజలు చేయడం ఇస్రో ఆనవాయితీ. ఈ ప్రయోగానికి సంబంధించి కూడా ఇస్రో ఛైర్మన్ కే శివన్ తిరుమలకు మంగళవారం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Dj2PGx

No comments:

Post a Comment