Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 March 2021

ఫలించిన ప్రయత్నాలు.. ఎట్టకేలకు కదలిన ఎవర్ గివెన్.. ఊపిరి పీల్చుకున్న ప్రపంచం

సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన భారీ నౌక ఎట్టకేలకు కదలింది. ఆరు రోజులుగా చేసిన ప్రయత్నాలు సోమవారం ఫలించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. నౌక ముందుభాగం కూరుకుపోయిన చోట ఇసుక, మట్టిని డ్రెడ్జర్లు తవ్వుతుండగా... పది టగ్‌ బోట్లు నౌకను కదిలించే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో నౌక కింద నీటిని పంప్‌ చేయగా.. వీటికి సముద్రపు పోటు సహకరించింది. దీంతో నౌక పాక్షికంగా, ఆ తర్వాత పూర్తిగా సవ్యదిశలోకి వచ్చింది. ప్రస్తుతం ఎవర్ గివెన్ ప్రయాణం సాఫీగా సాగుతోందని ఈజిప్టు యంత్రాంగం వెల్లడించింది. నౌక పునరుద్దరణ చర్యల్లో భాగంగా 18 మీటర్ల లోతులో 27 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తొలగించారు. గత మంగళవారం నౌక సూయజ్‌ కాలువలో ప్రయాణిస్తుండగా భారీ గాలులకు అడ్డం తిరిగి, దాని ముందుభాగం ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ‘‘పుల్‌-పుష్‌ ప్రయత్నాలకు ఎవర్‌ గివెన్‌ బాగా స్పందించింది. అడ్డంగా ఉన్న ఈ నౌకను 80 శాతం సాధారణ స్థితికి తీసుకొచ్చాం. తర్వాత పూర్తిగా నీటిపై తేలింది.. ఇరుక్కున్న ప్రాంతం నుంచి 102 మీటర్లు (335 అడుగులు) ముందుకు కదిలింది’’ అని సూయిజ్‌ కెనాల్‌ అథారిటీ చీఫ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఒసామా రబీ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 23 నుంచి ఈ కాలువలో ట్రాఫిక్ జామ్ కావడంతో 450 నౌకలు ఆ మార్గంలో నిలిచిపోయాయి. ఈ నౌకలన్నీ చమురు, సరుకులు, పశువులను తరలిస్తున్నవే. ప్రస్తుతం నౌక సాధారణ స్థితికి వచ్చి సమస్య పరిష్కారమైనప్పటికీ పూర్తిస్థాయిలో రవాణా పునరుద్ధరణకు కనీసం పది రోజుల పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మరికొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం ఆరంభించాయి. సూయజ్ కాలువ నియంత్రణ బాధ్యతలను ఈజిప్టు నిర్వహిస్తుండటంతో ఆ దేశానికి రోజుకు 14 మిలియన్ డాలర్లు మేర నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో దాదాపు 95 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.710 కోట్ల) వరకు కోల్పోయింది. ప్రపంచ మొత్తం వాణిజ్యంలో 12 శాతం సూయజ్ కాలువ గుండానే జరుగుతుంది. కరోనా కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థ కుచించుకుపోగా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు దాదాపు వారం రోజులు సూయజ్ కాలువలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. పలు నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగే ప్రయాణాన్ని ఎంపిక చేసుకున్నాయి. ఈ సుదీర్ఘ మార్గంలో ప్రయాణ ఖర్చులు తడిసిమోపుడవుతాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3u6yaVm

No comments:

Post a Comment