మహిళల శరీరాకృతి, వారి వస్త్రధారణ గురించి నీచమైన కామెంట్స్ చేసి వివాదాలను రాజేసిన ప్రజాప్రతినిధులు కోకొల్లలు. మహిళలను ఉద్దేశించి ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ జాబితాలోకి తమిళనాడు నేత వచ్చి చేరారు. విదేశీ ఆవుల పాలు తాగుతూ మన మహిళలు డ్రమ్ముల్లా తయారవుతున్నారంటూ వారి శరీరాకృతి గురించి నేత అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాల నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. డీఎంకే సీనియర్ నాయకుడు దిండిగుల్ లియోని అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరులో డీఎంకే తరఫున బరిలో ఉన్న కార్తికేయ శివసేనాపతి తరఫున లియోనీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళల శరీరాకృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘ప్రస్తుతం చాలా రకాలు ఆవులున్నాయి. డెయిరీ ఫామ్‌లలో విదేశీ ఆవులను చూసే ఉంటారు. వీటి నుంచి పాలను పితకడానికి మెషిన్లను వాడతారు. ఒక్కసారి స్విచ్ ఆన్ చేస్తే.. గంటలో ఈ మెషీన్ 40 లీటర్ల పాలు పితుకుంది. ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఈ విదేశీ ఆవుల పాలు తాగుతున్నారు. అందుకే వారి శరీరాకృతి మారి.. డ్రమ్ముల్లా మారుతున్నారు. గతంలో మహిళలు ‘8’ ఆకారంలో ఉండేవారు. పిల్లల్ని అలవోకగా ఎత్తుకునే వారు. వారి నడుము పిల్లలు కూర్చోడానికి అనుకూలంగా ఉండేది.. కానీ ఇప్పుడు ఎవరూ అలా కనిపించడం లేదు. అధిక బరువుతో పిల్లలను ఎత్తుకోలేకపోతున్నారు. దానికి కారణం విదేశీ ఆవు పాలు తాగడమే’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆయన పక్కనే ఉన్న డీఎంకే నేతలు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం రేషన్ సరఫరాపై మాట్లాడాల్సిందిగా లియోనికి సూచించారు. కాసేపు దాని గురించి ప్రసంగించి మళ్లీ టాపిక్‌ను ఆడవారి వద్దకే తెచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లియోనీ వ్యాఖ్యలపై నెటిజన్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులు సైతం లియోని వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. లియోని వ్యాఖ్యలపై డీఎంకే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ నేత గాయత్రి రఘురామ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘ఇది చాలా సిగ్గుచేటు.. ఆయన ఏ పాలు తాగుతాడు? గర్భధారణ తర్వాత లేదా హార్మోన్ల లోపం వల్ల మహిళల శరీరాకృతిలో ఎటువంటి మార్పులు జరుగుతాయో అతనికి తెలుసా? ఈ రకమైన పురుషహంకారికి కనిమొళి ఏమి చెప్పాలనుకుంటున్నారు? మీ పార్టీ నేతలు మహిళలపై చూపే గౌరవం ఇదేనా?’ అంటూ ఆమె ప్రశ్నించారు. బీజేపీకి చెందిన మరో మహిళా నేత వనితీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘మహిళలను కించపరచడం డీఎంకే సంప్రదాయం.. ఇలాంటి వ్యాఖ్యలను బట్టి డీఎంకే పాలనలో మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారని భావిస్తున్నారు’ అని మండిపడ్డారు. కాగా, గతంలోనూ లియోని అనేక సార్లు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2P3ZAMR
No comments:
Post a Comment