
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులను అడ్డుకోడానికి మద్దతుదారులు ప్రయత్నించారు. ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని నారాయణ రాణే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీంతో రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో పదవిలో ఉండగా ఓ కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్ట్ చేయడం గడచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరి నిమిషం వరకు అరెస్ట్‌ను ఆపడానికి ప్రయత్నించిన మంత్రి.. బాంబే హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. రాణేపై నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు న్యాయస్థానం అంగీకరించలేదు. ముందు రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే తాము పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ రాణే సోమవారం రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఆగస్టు 15న చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటని, ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారన్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3sGsnGz
No comments:
Post a Comment