Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 18 February 2022

యుద్ధం అంచున ఉక్రెయిన్: ప్రజల్ని రష్యాకు తరలిస్తున్న వేర్పాటువాదులు

రష్యా- ఉక్రెయిన్‌ మధ్య పరిస్థితి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయి. పరస్పరం ఫిరంగుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఈ ప్రాంతంలో గత రెండు రోజులుగా దాదాపు 500 పేలుళ్లు నమోదయ్యాయి. ఈ ఘర్షణలు అమెరికా సహా నాటో కూటమిని కలవరపరుస్తున్నాయి. దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో శుక్రవారం డొనియెస్కీ ప్రాంత వేర్పాటువాద ప్రభుత్వ నేత పుష్లిన్‌ కీలక ప్రకటన చేశారు. తమ ప్రాంతంలోని మహిళలు, వృద్ధులు, చిన్నారులను రష్యాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకు రష్యా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, ఐక్యరాజ్యసమితిలో రష్యా వైఖరిపై అమెరికా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. డాన్‌బాస్‌ ప్రాంతానికి సంబంధించి గతంలో జరిగిన మిన్స్క్‌ ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ ఉల్లంఘించిందని, దీనిపై చర్చ జరపాలని రష్యా కోరడంతో ఐరాస భద్రతా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రష్యాపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం పక్కా అని, సాకు కోసమే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. వేర్పాటువాద ప్రభుత్వాలు ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతంలో బాంబు, డ్రోన్‌ దాడులు తానే చేసి, నెపం ఉక్రెయిన్‌పైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణ జరుగుతోందన్న రష్యా ప్రకటనలను అమెరికా కొట్టిపారేసింది. సైన్యాన్ని లక్ష నుంచి లక్షా 50 వేలకు రష్యా పెంచిందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు బైడెనే ఈ విషయాన్ని వెల్లడించారు. ఐరోపా భద్రతా సహకార సంస్థలోని అమెరికా ప్రతినిధి మైకెల్‌ కార్పెంటర్‌ కూడా ఈ సంఖ్య ఇంకా భారీగా ఉందని చెప్పారు. 1,69,000 నుంచి 1,90,000 మధ్యలో రష్యా సైన్యాన్ని మోహరించిందని పేర్కొన్నారు. రష్యా అనుకూల వేర్పాటువాదులతో కలిపి ఈ సంఖ్య 1.90 లక్షలు ఉంటుందని అన్నారు. యుద్ధం, దాని వల్ల తలెత్తే బాధలు లేదా ప్రతి ఒక్కరికీ భవిష్యత్తును అందించే దౌత్యమా అనేది రష్యానే ఎంపిక చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో శుక్రవారం మాట్లాడిన ఆయన.. సరిహద్దుల వద్ద మోహరించిన రష్యా బలగాల్లో 40 శాతం ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వచ్చే వారం లేదా రాబోయే రెండు రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయాలని రష్యా భావిస్తోందని బైడెన్ జోస్యం చెప్పారు. కీవ్, వేర్పాటువాదుల మధ్య మధ్యవర్తిత్వ చర్చలకు పట్టుబట్టడం ద్వారా రష్యా శాంతి ప్రక్రియకు ఆటంకం కలిగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరైన నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. సైనిక విన్యాసాల కోసం సమీకరించిన రష్యా బలగాల పరిమాణం చాలా ఎక్కువగా ఉందని, ఎటువంటి హెచ్చరికలు లేకుండా దాడి చేయగల సామర్థ్యం ఆ దేశానికి ఉందని హెచ్చరించారు. మరోవైపు, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో రష్యా కీలక ప్రకటన చేసింది. అణు బాంబులను మోసుకెళ్లే ఖండాతర, క్రూయిజ్‌క్షిపణులతో శనివారం సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో క్రిమియా కేంద్రంగా ఉన్న రష్యా నల్లసముద్రపు నేవీ యుద్ధనౌకలు కూడా ఇందులో పాల్గొనున్నాయి. ఈ విన్యాసాలను రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వీక్షించనున్నారని తెలిపింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/yjSdkQI

No comments:

Post a Comment