4న ఆల్ పార్టీ మీటింగ్.. కరోనా టీకాపై ఏం చెప్తారో?

ప్రధాని మరోసారి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న దేశంలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో విర్చువల్‌గా మాట్లాడనున్నారు. దేశంలో కరోనా స్థితిగతులు, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీల నుంచి అభిప్రాయం తీసుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్‌ 4) ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్లమెంట్‌ ఉభయ సభల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమన్వయం చేయనుంది. దేశంలో కరోనాతో ఏర్పడిన సంక్షోభం తర్వాత ఇది రెండో అఖిలపక్ష భేటీ కావడం గమనార్హం. దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయోగాలు కీలక దశకు చేరుకోకున్న తరుణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా.. నవంబర్ 28న ప్రధాని మోదీ అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేలోని ఫార్మా సంస్థల్లో వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ భేటీ అనంతరం కరోనా వ్యాక్సిన్‌పై ప్రకటన చేసే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరు కానున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36lRrc5

Post a Comment

0 Comments