యూపీలో కారు బీభత్సం.. ఐదుగురి దుర్మరణం, సీఎం దిగ్భ్రాంతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫతేపూర్‌లోని చౌరాసి ప్రాంతంలో అతివేగంతో అదుపుతప్పి కారు రెండు బైక్‌లు, ఓ సైక్లిస్ట్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. వాహనదారులను ఢీకొట్టిన అనంతరం కారు కలిమిట్టి దబౌలి సమీపంలోని ఓ చెట్టును ఢీకొట్టి గుంతలో పడిపోయిందని ఫతేపూర ఎస్పీ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురున్నారు. వారిని రాకేశ్‌ (35), అతడి తండ్రి రాజారామ్‌ (65), కుమారుడు రితిక్‌ (5)గా గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరిని ఆశిష్ (25), సౌరభ్ (38)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడని, అతడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34qei4A

Post a Comment

0 Comments