కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. జమ్మూ కశ్మీర్‌ పునర్విభజనకు సింథియా సపోర్ట్

ఆర్టికల్ 370 రద్దు, పునర్విభజన బిల్లు అంశంపై కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. హస్తం పార్టీ కీలక నేత పార్టీ వైఖరికి భిన్నంగా స్పందించారు. జమ్మూ కశ్మీర్, లడక్ పునర్విభజనకు ఆయన మద్దతు తెలిపారు. జమ్మూ కశ్మీర్ సంపూర్ణంగా భారత్‌లో చేరికకు తాను మద్దతు పలుకుతున్నానని ట్వీట్ చేశారు. దీనికి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తే.. బాగుంటుందన్నారు. అప్పుడు ఎలాంటి ప్రశ్నలు తలెత్తవన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ బిల్లుకు మద్దతు పలుకుతున్నానని స్పష్టం చేశారు. దేశమంటే భూమి కాదు.. దేశమంటే ప్రజలంటూ.. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజనపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సభలో కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ తీరును విమర్శిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ వైఖరికి విరుద్ధంగా సింథియా ప్రకటన ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ వైదులుగుతున్న తరుణంలో.. ఆ పదవిని సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింథియాల్లో ఒకరు చేపడితే బాగుంటుందని కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్‌రా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చీఫ్ పదవి రేసులో ఉన్న సింథియా పార్టీ తీరుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకం కాదని చెప్పడం కోసం ఆయన ఇలా వ్యూహాత్మకంగా స్పందించారా? లేదంటే ఆపరేషన్ కమలంలో భాగమా? అనేది తేలాల్సి ఉంది. గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో జ్యోతిరాదిత్య సింథియా కీలక పాత్ర పోషించారు. సీఎం పదవి కోసం ఆయన చివర వరకూ పోటీ పడ్డారు. రాహుల్ ఆయన వైపే మొగ్గినప్పటికీ.. సోనియా సూచనతో సీనియర్ నేత అయిన కమల్ నాథ్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ మహిళా నేత వసుంధర రాజే సింథియాకు జ్యోతిరాదిత్య సింథియా స్వయానా మేనల్లుడు. 2001లో తండ్రి మాధవరావు సింథియా హఠాన్మరణంతో సింథియా రాజకీయాల్లోకి వచ్చారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33jnjee

Post a Comment

0 Comments