ప్రజల్లో స్థైర్యం నింపిలే సైనిక దుస్తుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు.. వీడియో షేర్ చేసిన జెలెన్‌స్కీ

రష్యాతో దాడులకు భయపడి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రష్యాకు మొదటి లక్ష్యం నేనే అని, నేను రాజధాని విడిచి పారిపోయినట్టు వస్తున్న వార్తలు అబద్ధమన్నారు. ‘‘ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ప్రజలతోనే ఉంటాను. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయే ప్రసక్తే లేదు’ అని ఆయన తేల్చి చెప్పారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి, చర్చలకు రావాలి. రష్యా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కీవ్‌పై పట్టుసాధించడానికి రష్యా ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కీవ్‌ను పోగొట్టుకోమని జెలెన్‌స్కీ అన్నారు. ఇవాళ రాత్రికి మనం తట్టుకోవాలని, వందల మంది శత్రుసైనికులను మట్టుబెట్టామని అన్నారు. దాడుల సమయంలో ఉక్రెయిన్ కూడా కొంత మంది హీరోలను కోల్పోయిందని, నివాస సముదాయాలపై కూడా రష్యా దాడులకు తెగబడుతోందని ఆయన మండిపడ్డారు. ఓ సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వొలొడిమిర్‌ జెలెన్‌స్కీ.. రష్యా ఆక్రమణ నుంచి కీవ్‌ను కాపాడుకుందామని ఉద్ఘాటించారు. సైనిక యూనిఫామ్‌ మాదిరిగా ఉన్న ఆలివ్ గ్రీన్ రంగు దుస్తులు ధరించిన జెలెన్‌స్కీ ఆ పక్కనే ఉక్రెయిన్ ప్రధాని, చీఫ్ ఆఫ్ స్టాప్, ఇతర సీనియర్ సహచరులు ఈ వీడియోలో ఉన్నారు. ‘‘మేమంతా ఇక్కడే ఉన్నాం.. మన సైన్యం ఇక్కడ ఉంది.. సమాజంలోని పౌరులు ఇక్కడ ఉన్నారు.. మనమందరం ఇక్కడ మన స్వాతంత్య్రాన్ని, మన దేశాన్ని కాపాడుకుంటున్నా.. అది అలాగే ఉంటుంది’’ అని స్థైర్యం నింపారు. ‘‘రష్యా దాడులు ఆపేంతవరకూ మేం పోరాడుతూనే ఉంటాం. భాగస్వామ్య దేశాలను అడుగుతున్నా... మీరు ఉక్రెయిన్‌తో ఉన్నారా? లేరా? ఉన్నామని సమాధానమిస్తే, మమ్మల్ని నాటోలోకి తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరో చెప్పండి. యుద్ధంలో ఇప్పటివరకూ 137 మంది హీరోలను కోల్పోయాం. వీరిలో పదిమంది సైనిక అధికారులు ఉన్నారు’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మార్షల్‌ లాను ప్రకటించిన జెలెన్‌స్కీ, 90 రోజులపాటు పూర్తిస్థాయిలో సైన్యాన్ని సమీకరించేలా ఉత్తర్వులు జారీచేశారు. ఉక్రెయిన్‌ నేత శుక్రవారం వీడియో ద్వారా ఐరోపా సమాఖ్య నేతలతో మాట్లాడారని, అప్పుడాయన బంకర్‌ నుంచి మాట్లాడినట్టుందని స్వీడన్‌ ప్రధాని మగ్దలెనా ఆండర్సన్‌ పేర్కొన్నారు. జెలెన్‌స్కీ ఎక్కడ ఉన్నారన్నది మాత్రం తెలియరావడం లేదు. కీవ్‌ను స్వాధీనం చేసుకోడానికి రష్యా సైన్యం ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో వాసిల్కివ్ సమీపంలో రష్యా సైనిక రవాణా విమానాన్ని కూల్చివేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు, జెలెన్‌స్కీ ప్రభుత్వాన్ని ఉగ్రవాదులతో పోల్చిన రష్యా అధినేత పుతిన్.. వాళ్లు మత్తు పదార్థాలకు బానిసలని, కొత్తతరం నాజీలని ధ్వజమెత్తారు. ఉక్రెయిన్ సైన్యం ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం హస్తగతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/XfJBSzi

Post a Comment

0 Comments