పట్టాలపై పడిపోయిన చిన్నారి… కాపాడేందుకు కదులుతున్న రైలు కింద పడిన వ్యక్తి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని రక్షించడానికి ఓ వ్యక్తి పెద్ద సాహసం చేశాడు. సినీ ఫక్కీలో ప్రాణాలకు తెగించి మరి పాపను కాపాడాడు. ఎంతో వీరోచితంగా ఎవరూ చేయని పనిని చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఫిబ్రవరి ఐదో తేదీన ఈ ఘటన జరిగింది. ఆ రోజు సాయంత్రం భోపాల్లోని బర్ఖేడి ప్రాంతంలో నమాజ్ నుంచి తన ఫ్రెండ్‌తో తిరిగి వస్తుండగా ఒక దగ్గర రైలు పట్టాలను దాటాల్సి వచ్చింది. అయితే పట్టాలపై నుంచి ఓ గూడ్స్ రైలు వస్తున్నట్టు చూశారు. దాంతో అది వెళ్లేంత వరకు అక్కడ ఆగిపోయారు. అదే సమయంలో అక్కడే తల్లిదండ్రులతో నిలబడి ఉన్న ఒక అమ్మాయి అకస్మాత్తుగా పట్టాలపై పడిపోయింది. పైకి లేవడానికి చాలా కష్టపడుతుంది. మరోవైపు నుంచి గూడ్స్ రైలు దూసుకొచ్చేస్తుంది. మిగతా వారంతా ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయారు. కానీ మహమ్మద్ మెహబూబ్ అలా చేయలేకపోయాడు. వెంటనే కింద పడి పైకి లేవడానికి కష్టపడుతున్న అమ్మాయి వైపు పరుగెత్తుకుని వెళ్లాడు. క్షణాల్లో తను కూడా ఆ పట్టాలపై పడిపోయి పాపను కరెక్టుగా పట్టాల మధ్యలోకి లాగేశాడు. బాలిక తలను కిందకు దించి పట్టుకున్నాడు. రైలు వెళ్లేంత వరకూ చిన్నారితోపాటు పట్టాలపై కదలకుండా ఉండిపోయాడు. వారిపై నుంచి గూడ్స్ రైలు దూసుకుపోయింది. అలా తన ప్రాణాలను అడ్డువేసి మరీ పాపను రక్షించాడు. దాంతో బాలిక తల్లిదండ్రులకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ చుట్టు ఉన్నవారు మెహ‌బూబ్ చేసిన పనికి మొదట ఆశ్చర్య పోయినా తర్వాత ఆయన్ని ప్రశసించారు. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న మరికొంత మంది వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో మహమ్మద్ మెహబూబ్ ధైర్య సాహసాలు అందరికి తెలిశాయి. సినిమాలో ఓ హీరోలా ఆయన చేసి పనికి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. అయితే మెహ‌బూబ్ దగ్గర ఫోన్ లేదు. దాంతో అసలు ఈ వీడియో ఇలా వైరల్ అవుతున్న విషయం కూడా ఆయనకు తెలియదు. అతనికి పెళ్లి అయి మూడేళ్ల కూతురు కూడా ఉంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/0zsNQ4D

Post a Comment

0 Comments