ఖురాన్‌ను తగలబెట్టిన అతివాదులు.. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన స్వీడన్

ముస్లింల మత గ్రంథం ఖురాన్‌ను తగులబెట్టడానికి స్వీడన్‌లో ఓ అతివాద గ్రూప్‌ చేసిన ప్రయత్నించడంతో అక్కడ నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. దక్షిణ స్వీడన్ నగరం మాల్మో ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఘర్షణకు దిగిన ఆందోళకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. రోడ్లపై టైర్లను తగులబెట్టి బీభత్సం సృష్టించారు. మాల్మో నగరంలో కొన్ని గంటలపాటు జరిగిన అల్లర్లలో అనేక కార్లు తగలబడ్డాయి. దాదాపు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారినట్టు పోలీసులు, స్థానిక మీడియా వెల్లడించాయి. దేశ బహిష్కరణకు గురైన అతివాద నాయకుడు, ముస్లిం వ్యతిరేకి రాస్మస్‌ పలాడన్‌‌ను ఖురాన్ తగలబెట్టే కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆయన అనుచరులు మాత్రం మత గ్రంథాన్ని తగలబెట్టే కార్యక్రమం పూర్తి చేశారు. రాస్మన్ పలాడన్‌ను దేశ సరిహద్దుల అవతల విడిచిపెట్టిన పోలీసులు.. ఆయనపై రెండేళ్లు నిషేధం విధించినట్టు తెలిపారు. జాతివివక్షను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై అతివాద స్ట్రామ్‌కర్స్‌ (హార్డ్‌లైన్‌) పార్టీ అధినేత రాస్మస్‌కు ఈ ఏడాది ఆరంభంలో నెలరోజుల జైలుశిక్ష విధించారు. పార్టీకి చెందిన సోషల్ మీడియా ఛానెళ్లలో ఇస్లాంకు వ్యతిరేకంగా వీడియోలు పోస్టు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మాల్మో నగరంలో శుక్రవారం ఖురాన్ తగులబెట్టే కార్యక్రమానికి రాస్మస్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునే శుక్రవారం నాడే వారిని రెచ్చగొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దేశంలో చట్టాలను ఉల్లంఘించడానికి పలాడన్ ప్రయత్నించినట్టు అనుమానిస్తున్నామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఆయన ప్రమాదకర ప్రవర్తన వల్ల సమాజానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. తనను దేశం నుంచి రెండేళ్ల బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. రేపిస్ట్‌లు, హంతకులకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంటారు.. తనపై మాత్రం దేశ బహిష్కరణ వేటు వేశారు అన్నారు. పలాడాన్ గతేడాది ముస్లింలు అసహ్యకరమైన మాంసం కొరియా బేకన్‌ను తగులబెట్టి మీడియా దృష్టిని ఆకర్షించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34MS3Hw

Post a Comment

0 Comments